కూతురిని హత్య చేసిన తల్లి, బెజవాడలో పరువు హత్య

అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధానిగా సేవలందిస్తోన్న విజయవాడలోని వాంబే కాలనీలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లే కడుపు చించుకుని పుట్టిన కూతురిని హతమార్చింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లే కూతురిని దారుణంగా హత్య చేసింది. వేరే మతస్థుడిని ప్రేమించిందన్న సాకుతో కన్న కూతురిని ఓ మహిళ హత్య చేసింది. విజయవాడలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. అయితే ఈ విషయంలో భార్య చేసిన నేరానికి ఆమెను తప్పుబట్టాల్సిన భర్త అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే… కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన బీబీజాన్‌కు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు నజ్మా ఓ యువకుడితో ప్రేమలో పడిందని తల్లికి అనుమానం వచ్చింది.

murder

దీంతో కుటుంబాన్ని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు మార్చింది. అయినా కూతురు వ్యవహారంలో మార్పు రాలేదు. మళ్లీ మూడు నెలల కిందట విజయవాడలోని వాంబే కాలనీకి వచ్చారు. అక్కడ కూడా కూతురు తన మాట వినకపోవడంతో ఆగ్రహానికి గురైన ఆమె మంగళవారం రాత్రి నిద్ర పోతున్న కుమార్తె నజ్మా ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. బుధవారం ఉదయాన్నే విషయం బయటకు పొక్కకుముందే కడుపు నొప్పితో తన కూతురు చనిపోయిందని అందరినీ నమ్మించింది. అయితే నజ్మాను ప్రేమించిన దీపక్ యువకుడికి ఈ విషయం తెలియడంతో పోలీసులను సంప్రదించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీబీని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని వెల్లడించింది. తాను వారించినా వినకుండా తన కూతురు వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందని అందుకే హత్య చేశానని విచారణలో నిజాన్ని అంగీకరిచింది. తన కూతురు కంటే తమకు పరువే ముఖ్యమని ఆమె చెప్పడం విశేషం. కుటుంబం పరువు తీస్తున్న కారణంగానే తన కూతురిని హత్యచేశానని ఆమె చేసిన నేరాన్ని నిర్భయంగా ఒప్పుకుంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన బీబీ జాన్ భర్త మైసూర్ ఖాన్‌లో కూడా కూతురు చనిపోయిందన్న బాధ ఏ మాత్రం కనిపించలేదు. భార్య వాదనకే అతడు కూడా మద్దతు పలకడం విశేషం.

కన్న కూతురి కంటే పరువు ముఖ్యమని మీడియా ముందు చెప్పడంతో అందరూ నిర్ఘాంతపోయారు. కూతురు విషయంలో తన భార్య చేసిన పని తనకు తప్పుగా కనిపించడం లేదని చెప్పాడు. కాగా నజ్మా ప్రియుడు దీపక్ మాట్లాడుతూ …ఈ రోజుల్లో కూడా పరువు కోసం కన్న కూతుర్ని హతమార్చడం దారుణమన్నాడు. తమ వివాహానికి నజ్మా తల్లి కూడా అభ్యంతరం చెప్పలేదని, అయితే ఇలా చేస్తుందని తాను కలలో కూడా ఊహించలేదన్నాడు. చలాకీగా ఉండే నజ్మా హఠాత్తుగా అనారోగ్యంతో మృతి చెందినదని చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. అయితే నజ్మా తాను ఎప్పుడూ బయట తిరిగింది లేదని దీపక్ తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *